లెక్కలేనంత ప్రేమను కొలతలు వేసి బస్తాల్లో నింపి మరో జన్మకు సరిపడా దాచాలని ఉంది”!!
నేల నింగి లెక్కలకు అందని ప్రేమంతా నాకే కావాలని పట్టు పట్టాలని ఉంది.. “!!
*ప్రేమకు లెక్క కట్టాలని ఉంది కొలతలు
తూచాలని ఉంది.. “!!
ప్రేమ కవయిత్రి ఆర్.రమాదేవి కవిత్వానికి కాస్తంత ఎడంగా ఈ మధ్య ప్రేమకథలకు శ్రీకారం చుట్టారు. అయితే…తనకు అచ్చొచ్చిన “ప్రేమ” ను మాత్రం మిస్ కాకుండా కొనసాగించడం విశేషం.. ఈరోజు కాఫీటైమ్లో రమాదేవిగారి ప్రేమ మార్క్ కవితను…చూద్దాం.!,
“ఎంత ఆశనో
ప్రేమకు లెక్క కట్టాలని ఉంది
కొలతలు తూచాలని ఉంది
కొదవ పడ్డ వాటిని సరిచేయాలని ఉంది
తప్పుకు పోకుండా, తప్పించుకుపోకుండా
తికమక లెక్కలతో బంధించాలని ఉంది
లెక్కలేనంత ప్రేమను
కొలతలు వేసి బస్తాల్లో నింపి
మరో జన్మకు సరిపడా దాచాలని ఉంది
పేరాశ ఒకటి పెనవేసుకుపోతోంది
నేల నింగి లెక్కలకు అందని ప్రేమ
అంతా నాకే కావాలని పట్టు పట్టాలని ఉంది
పూర్తిగా స్వార్థపరురాలినై పోవాలని ఉంది
ఓయ్
ఇందులో
నీ ప్రమేయం ఏమీ లేదు కదా
అయినా
నెపం నీ మీదే వేయాలని ఉంది”!!
*ప్రేమ” ఒక్క క్షణంలో పుడుతుంది.మరిచిపోదామంటే ఓ జీవితకాలం చాలదు..ప్రేమ తడి తగిలిన చోటంతా పచ్చని ప్రేమ మొక్కగా మొలకెత్తుతుంది.
ప్రేమ..ప్రేమ.. ప్రేమ.. అసలేమిటీ ప్రేమ?ప్రేమ కాలాంతరమా? ప్రేమకు ఓ కాలమంటూలేదా? ప్రేమ నిత్యం పారే జీవనదా? ప్రేమకుహద్దులు,.సరిహద్దులులేవా?
ఈ ప్రేమ వాహినిపారని దేశం,ప్రదేశం వుందా? ప్రేమ తడితగిలి మొలకెత్తని హృదయం వుందా? అసలు ఈ లోకంలో ప్రేమ లేని జీవితం,ప్రేమలేని మనిషి వున్నాడా? ఏమిటీ ప్రేమ?ఏమిటో దీని గొప్పదనం?
ప్రేమంటే రెండక్షరాలే కాదు అది రెండు హృదయాల స్పందనప్రేమంటే యుగళగీతం కాదు..అది..ఇరువురు కలిసి ఒక్కటై పాడుకునే సోలో పాట….మరి
ఇలాంటి ప్రేమను ఎవరైనా అంచనా వేయగలరా?
అసలు లెక్క కట్టగలరా? కానీ ఈ కవితలోని నాయికకు ఆ కోరిక కలిగింది. ఆశపడింది.. ప్రేమకు లెక్కకట్టాలని,కొలతలు తూచాలని, కొదవ పడ్డ వాటిని సరిచేయాలని నడుంకట్టింది.. ప్రయత్నించింది. అంతే కాదు.. అతగాడు ఈ ప్రేమ కొలతలనుంచి తప్పుకు పోకుండా, తప్పించుకుపోకుండా తికమక లెక్కలతో బంధించాలనుకుంది..
అంతేకాదు…లెక్కలేనంత ప్రేమను కొలతలు వేసి బస్తాల్లో నింపి మరో జన్మకు సరిపడా దాచాలన్న పేరాశ కూడా ఆమెను పెనవేసుకుపోయింది.నేల నింగి లెక్కలకు అందని ప్రేమఅంతా తనకే కావాలని పట్టు పట్టి, పూర్తిగా స్వార్థపరురాలినై పోవాలని గట్టిపట్టే పట్టింది.
సరేగానీ, తన ఈ ప్రయత్నంలో అతగాడి(సఖుడి)
ప్రమేయం ఏమీ లేదు కదా!అని కించిత్ సంశయానికిలోనైంది.ప్రమేయం వున్నా.. లేకున్నా.. ఈ నెపం అతగాడి మీదే వేయాలని ఉందంటోంది…
అతగాడు తన లెక్కలకందని ప్రేమ పంచాలన్నది ఆమె ఉద్దేశం..!